నల్లగొండ: పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో మూడేండ్ల బాలుడు కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నది. హాస్పిటల్ ఆవరణలో ఆడుకుంటున్న అబు అనే మూడేండ్ల బాబును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మంగళవారం సాయంత్రం దవాఖాన ఆవరణలో వెతికిన బాలుడి తల్లిదండ్రులు ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 4న మధ్యాహ్న సమయంలో దవాఖానలోకి ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చిన దుండగుడు.. అక్కడే ఉన్న మూడేండ్ల బాలుడిని మాయమాటలు చెబుతూ ఫోన్లో మాట్లాడిస్తూ తీసుకెళ్తున్నట్టుగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు రికార్డుల్లో నమోదైంది. హాస్పిటల్ నుంచి బాలుడిని రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్లినట్టు గుర్తించారు.
అయితే సీసీ కెమెరాల్లో దుండగుడు అక్కడికి వచ్చినట్టుగా ఎక్కడా కనబడలేదు. దీంతో బస్టాండ్ ఆవరణలో వెతికినా కూడా ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో బాలుడిని తీసుకెళ్తున్న ఫుటేజ్ లభ్యం కాలేదు. దీంతో బాలుడిని నల్లగొండ పట్టణంలోనే ఎక్కడో చోట దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. కాగా, గత మూడేండ్లుగా బాధిత కుటుంబం శహమున్నిసాబేగం, అహ్మద్ దంపతులు తమ కొడుకు అబూతో కలసి దవాఖాన ఆవరణలోనే జీవనం సాగిస్తున్నప్పటికీ అక్కడి సిబ్బంది వారిని గుర్తించకపోవడం గమనార్హం.
