ఆదివాసీల పోరాటానికి అండగా నిలవండి : కె. శివారెడ్డి

Published on 

బస్తర్ కేంద్రంగా ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న నరమేధాన్ని అడ్డుకోవాలని, వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలకు అండగా నిలబడాలని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహిత కె. శివారెడ్డి పిలుపునిచ్చారు.

మధ్యభారత దేశంలో ఉన్న అపార ఖనిజ నిక్షేపాలను కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో భారత పాలక వర్గం అదివాసీలపై యుద్ధాన్ని ప్రకటించిందని దాన్ని ప్రశ్నిస్తున్న ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో చంపేస్తుందనీ, అమాయక అదివాసీలపై తప్పుడు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తుందని విమర్శించారు.

ఈ ఆదివాసీలకు అండగా ఉండేందుకే బుద్ధిజీవులు, హక్కుల సంఘాలు, విద్యార్ధి, మహిళ, ప్రజా సంఘాల సమన్వయంతో ‘‘ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక‘ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకటించారు.

ఆదివాసీల హక్కుల గురించి, బస్తర్ కేంద్రంగా సాయుధ బలగాలు సాగిస్తున్న మారణహోమాన్ని ప్రపంచ కి తీసుకువెళ్లేందుకు జూలై 20, 2024న హైదరాబాదులో సదస్సును నిర్వహించి అనంతర ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు.

పౌరహక్కుల సంఘం నాయకులు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ..ఛత్తీస్ గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో పేరుతో ఆదివాసీలను బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. తల్లి ఒడిలో పాలు తాగే పపిపాప మొదలూ మాటలు రాని మూగ బాలికను సహితం పోలీసు బలగాలు వదలడం లేదన్నారు. ఇంట్లో నుండి మహిళలను పట్టుకెళ్లి అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్యచేస్తున్నారని విమర్శించారు.

ఇంట్లో ఉన్నా, ఇప్పపూవ్వు ఏరడానికి వెళ్లినా, పశువులను మేపడానికి అడవికి వెళిన పట్టుకొని నక్సలైట్లు అనే పేరుతో ఎన్‌కౌంటర్‌కు పాల్పడుతున్నారని దీన్ని ప్రశ్నించేందుకే, ఆదివాసీలకు అండగా నిలబడేందుకే ఈ వేదికను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఆదివాసీ విద్యార్ధి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భట్టు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక రక్షణ చట్టాలతో సహా వాళ్ల జీవించే హక్కు కూడా తీవ్ర సంక్షోభంలో పడిందని విమర్శించారు. ఆదివాసీల కోసం రాజ్యంగంలో 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, పెసా యాక్ట్ వంటి చట్టాలు వచ్చినా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పట్టించుకోకుండా వాటిని తుంగలో తొక్కి రాజ్యంగ హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఆదివాసీలకు కష్టోడియన్‌గా ఉండాల్సిన రాష్ట్రపతి, గవర్నర్‌లు ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతున్నారే తప్ప ఆదివాసుల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు.

పీవోడబ్లూ సంధ్య మాట్లాడుతూ తమ హక్కుల గురించి మాట్లాడుతున్నందుకు ఆదివాసీ మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ కేంద్ర బలగాలు నిసిగ్గుగా వ్యవహారిస్తున్నాయని విమర్శించారు. ఆదివాసీ మహిళలను పోరాటాల వైపుకు రానివ్వకుండా ఉండేందుకే వాళ్ల నగ్నచిత్రాలను ప్రదర్శిస్తు న్నారని దుయ్యబట్టారు. ఇంత నిసిగ్గుగా వ్యవహరిస్తున్న, దాదాపుగా 30 మంది ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసినా అక్కడి అదివాసీలు పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు.

ప్రొ.అన్వర్ ఖాన్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు సాగిస్తున్న మారణహోమంలో అత్యధిక శాతం మహిళలు, యువకులే సమిధలుగా మారుతున్నారని విమర్శించారు. ఈ మారణహోమాన్ని వెలుగులోకి తీసుకురావడానికి పత్రికలు, టీవీ ఛానల్లు తమ వంతు పాత్రను పోషించాలని వారికి అండగా నిలవాలని కోరారు.

ఆదివాసులు తమ జీవన అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటం కేవలం వారిదే కాదని, ఈ దేశ ప్రజలందరికి చెందాల్సిన సహజ వనరులను కాపాడటానికి వాళ్లు పోరాడుతున్నారు విరసం నాయకులు రాము అన్నారు.

కార్పొరేట్ విధానాల వల్ల ధ్వంసమవుతున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కూడా ఆదివాసులు ఉద్యమిస్తున్నారని, కార్పొరేటీకరణ దేశమంతా విస్తరిస్తున్న పరిస్థితుల్లో ఆదివాసులు చేస్తున్న ఈ పోరాటాలు అన్ని సెక్షన్ల ప్రజలకు సంబంధించినవని వేదిక భావిస్తోందని. అందువల్ల దేశంలో కార్పొరేటీకరణకు బలైపోతున్న ప్రజలందరూ ఆదివాసీ పోరాటాలకు మద్దతు ప్రకటించవలసి ఉన్నదని అమరుల బంధుమిత్రలు సంఘం నాయకులు భవాని, ఓపీడీఆర్ నాయకులు లక్ష్మీ పిలుపు నిచ్చారు.

ఈ సమస్య మీద వేదిక తరపున సభలు సమావేశాలు, కరపత్రాలు, పుస్తకాల ప్రచురణ, ధర్నాలు, ర్యాలీలు, చర్చా గోష్టుల నిర్వహణ వంటి ప్రచార కార్యక్రమాలు చేపడుతుందని దీనికి ప్రజలందరూ తమ సంపూర్ణ మద్దతు తెలిపాలని ప్రజాకళా మండలి రాష్ట్ర నాయకులు జాన్ కోరారు.

ఈ నెల 20వ తేదీ శనివారం హైదరాబాదులో ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక తన తొలి కార్యక్రమం చేపట్టనుంది. ఆ రోజు జాతీయస్థాయిలో ఆదివాసుల కోసం పని చేస్తున్న కార్యకర్తలతో, మేధావులతో ఒక సదస్సు తలపెట్టిందని దీనికి సంపూర్ణ మద్దతు తెలిపాలని ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆజాద్ కోరారు.

ఈ కార్యక్రమంలో దేశభక్త ప్రజాతంత్ర వేదిక నాయకులు రాజు, తెలంగాణ రైతాంగ సమితి నాయకులు జక్కుల వెంకటయ్య తదితరులు పాల్లొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form