AP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ నేతృత్వంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక విధానాలను ప్రజలు ప్రశ్నించాలని కోరుతూ మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖను విడుదల చేసింది.
అవకాశవాద రాజకీయ పార్టీలతో కలెగూర గంపగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరిందని ఎద్దేవ చేసింది. పదవుల పంపకమైతే పూర్తయింది కానీ ఎన్డీఏ చేపట్టబోయే రాజకీయ, ఆర్థిక విధానాలేమిటో, దాని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఏమిటో ఇప్పటివరకైతే ప్రకటించలేదని ఆ లేఖలో విమర్శించారు.
ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ఉమ్మడి ఎజెండా కూడా లేదు కానీ చంద్రబాబు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో ఏ ప్రాతిపదికన చేరాడో ప్రకటించలేదని పేర్కొంది. వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్ళుగా అనుసరించిన ప్రజావ్యతిరేక, సామ్రాజ్యవాద, ఐడా భూస్వామ్య అనుకూల విధానాలనూ, నిరంకుశ పాలనను ప్రజలు వ్యతిరేకించి గద్దె దించారని గుర్తుచేశారు. ప్రత్యామ్నాయం లేక ప్రజలు టీడీపీకి ఓట్లు వేసారన్నారు.
ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన, బీజేపీలు విడి విడిగా తమ ఎన్నికల మానిఫెస్టోలను ప్రకటించాయని, ప్రస్తుతం ఏర్పడిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏ మానిఫెస్టోను అమలు పరుస్తుందని ప్రశ్నించారు.
రాష్ట్రం ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ప్రజలు డిమాండ్ చేయాలని ఆ లేఖలో కోరారు.
రాష్ట్రంలో ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను అమలు, ప్రజాసంఘాలపై అక్రమంగా మోపబడిన కేసుల్ని ఎత్తివేత, ప్రజల ప్రత్యామ్నాయ విప్లవ రాజకీయాలపై నిషేధాన్ని ఎత్తివేస్తారా లేదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.