ఇరాన్‌ అధ్యక్షుడు కన్నుమూత

Published on 

హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియన్ తదితరులు కూడా మరణించినట్లు ఆ దేశ వార్త సంస్థ ప్రకటించింది.

ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణిస్తున్నహెలికాప్టర్‌ ఆదివారం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే. దీంతో సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్ మలేక్‌ రహ్‌మతీ తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది.

ఆదివారం ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్‌ కలాసీ, ఖొదావరిన్‌ అనే రెండు డ్యాంలను అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియేవ్‌తో కలిసి రైసీ ప్రారంభించారు. వీటిని ఇరు దేశాలు కలిసి నిర్మించాయి. ఈ ప్రారంభ కార్యక్రమం అనంతరం విదేశాంగ మంత్రి హోస్సేన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్‌ ప్రావిన్సు ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్‌ పట్టణానికి హెలికాప్టర్‌లో రైసీ తిరుగు ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లు కూడా ఆయన వెంట బయలుదేరాయి. అయితే జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

ఈ ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్‌కు వాయవ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఆ ప్రమాదంలో హెలికాప్టర్‌ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడి మరణవార్తను ఇరాన్‌ మీడియా ధ్రువీకరించింది. ‘సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఇరాన్​ ప్రజలకు అండగా ఉంటాం’ అని భారత ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. అలాగే పలువురు దేశాధినేతలు కూడా రైసీ మృతిపై సంఘీభావం తెలిపారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా విచారం వ్యక్తం చేసింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form