TS: హైదరాబాద్ జలమండలి సరఫరా చేసే తాగునీటిని బైక్ క్లీనింగ్‌కు ఉపయోగించినందుకు ఓ వ్యక్తికి జలమండలి అధికారులు భారీగా జరిమానా విధించారు. ఈ ఘటన స్థానిక జూబ్లీ హిల్స్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా రోడ్ నెం. 78లో నీరు లీకేజీ అయినట్టు ఎండీ గమనించారు. ఆ వెంటనే స్థానిక జీఎంను లీకేజీకి గల కారణాలను ఆరా తియ్యమని ఆదేశించారు. దీంతో ఓ అండ్ డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్‌తో వెళ్లి పరిశీలించారు. లీకేజీ ఎక్కడ అయ్యిందా అని కొంతదూరం వెళ్లి చూడగా ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేసే తాగునీటితో బైక్ కడుగుతున్నాడు. ఇదే విషయం అధికారులు ఎండీకి విన్నవించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎండీ.. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని సూచించారు. అంతేకాకుండా అతనికి నోటీసులు అందించి, జరిమానా విధించాలని సంబంధిత జనరల్ మేనేజర్‌ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.1000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని ఎండీ తెలిపారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
