అరుంధతి రాయ్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి

Published on 

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన కేసులో ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షోకత్ హుస్సేన్‌లపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సేనా అనుమతి ఇచ్చారు.

భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగం కాదంటూ గతంలో అరుంధతి రాయ్ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఆమె వ్యాఖ్యలపై గతంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే స్పందించింది. ‘‘మంచి పేరున్న రచయిత్రి ఇలాంటి వివాదాస్ప వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే తన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకోవాలని’’ డిమాండ్ చేశారు. ‘‘అరుంధతిరాయ్ చరిత్రను వక్రీకరించే రీతిలో ప్రకటన చేశారని, ఇది ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోందని, చరిత్ర నిజాలను వక్రీకరించడమే అవుతుందన్నారు’’.

ఈ కేసులో కాశ్మీర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ 2010 అక్టోబర్ 28న ఢిల్లీలోని తిలక్ మార్గ్ ఎస్‌హెచ్‌ఓకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో, “ఆజాదీ – ది ఓన్లీ వే” బ్యానర్‌తో జరిగిన సమావేశంలో పలువురు వ్యక్తులు బహిరంగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 21, 2010న ఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్‌లోని ఎల్ టి జి ఆడిటోరియంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సి ఆర్ పి పి) నిర్వహించింది.

సుశీల్ పండిత్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశంపై 2010 నవంబర్ 29న అరుంధతీ రాయ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా, ఐపీసీ 124 ఏ కింద ఇప్పటివరకు దేశద్రోహం నేరారోపణకు అనుమతి లభించకపోవడంతో ఈ కేసు ముందుకు సాగలేదు. తాజా అనుమతితో ఆమెను విచారించే అవకాశం ఉంది.

అయితే ఆ మీటింగ్‌లో అరుంధతి రాయ్, హుస్సేన్‌లతో పాటు అప్పటి తెహ్రీక్-ఎ-హురియత్ ఛైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గిలానీ, విప్లవ రచయిత వరవరరావు కూడా నిందితులుగా ఉన్నారని పేరు బహిరంగపరచని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఆ మీటింగ్‌లో అరుంధతి రాయ్ మాట్లాడిన మాటలు ఇక్కడ వీక్షించవచ్చు..

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form