రాజమండ్రి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని మానసింగా కుంగదీసేందుకే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ అయిన మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు.
మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసి 40 రోజులు అయ్యిందని, ఒక్క రోజు కూడా కస్టడీకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు పేర్ని నాని. ఏపీ లిక్కర్ స్కాంలో సహా ముద్దాయిలు చెప్పిన ప్రకారం మిథన్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జైల్లో ఉంచినా మిథున్ రెడ్డి కుంగిపోయేది లేదని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డి బయటకు వచ్చాక రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాలపై తిరుగుబాటు చేస్తారని పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు.
కాగా.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. మిథున్‌రెడ్డికి జైల్లో సౌకర్యాలపై జైళ్ల శాఖ రివ్యూ పిటిషన్‌పై రేపు(బుధవారం) విచారణ జరిపి ఆదేశాలు ఇస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
