బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు జిల్లా పోలీసుల అధికారి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం బీజాపూర్ జిల్లాలోని ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నడ్‌పల్లి గ్రామానికి చెందిన జోగి (50) అటవీ ఉత్పత్తులను సేకరిస్తున్న సమయంలో బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.
ఆమె ప్రమాదవశాత్తు IEDపై కాలు పెట్టడంతో పేలుడు సంభవించిందని, దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన చెప్పారు. జోగిని వెంటనే ఉసూరులోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు.
బీజాపూర్‌తో సహా ఉమ్మడి బస్తర్‌లోని ఏడు జిల్లాలలోని మారుమూల ప్రాంతాలలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడానికి మావోయిస్టులు తరచుగా రోడ్ల వెంబడి, నిర్మాణ ప్రాంతాలలో, అడవులలోని డర్ట్ ట్రాక్‌ల వెంట గత కొంతకాలంగా IEDలను అమర్చుతున్నట్లు తెలిపారు.
బస్తర్‌లో ఇలాంటి ఉచ్చులకు చిక్కుకొని అనేక మంది పౌరులు బలైపోయారని పోలీసులు తెలిపారు. గత రెండున్నర నెలల్లో బీజాపూర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలుళ్లలో ఐదుగురు మరణించినట్లు ఆయన తెలిపారు.