AP: విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ కె.విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి సారి ప్రధాని విశాఖ వస్తున్నారు. బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకోనున్న మోదీకి ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు.
విశాఖలో రోడ్డు మార్గంలో సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగనుంది. ఈ ముగ్గురు కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అదేవిధంగా ప్రధాని పలు ప్రాజెక్టులకు, రైల్వే జోన్ ఏర్పాటుకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్లతో ఏర్పాటు చేసే బల్కు డ్రగ్ పార్కును మోదీ వర్చువల్గా శంఖుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.