‘వందేమాతరం’ – ఓ విచ్ఛిన గాథ

Published on 

  • ఎస్.ఎ. డేవిడ్

వందేమాతరానికి 150 ఏళ్ళు నిండాయి అని చట్టసభల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ గీతం చుట్టూ వున్న రాజకీయాలనూ, అందులోని మత కోణాన్ని, దేశ విభజనలో అది పోషించిన పాత్ర గురించి చర్చించేందుకే ఈ వ్యాసం.

స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో ‘వందేమాతరం’ అన్న నినాదం ప్రణవనాదమై లక్షలాది మందిని స్వాతంత్య్ర సమరానికి సన్నద్దం చేయడం నిజమేకావచ్చు. ఈ నినాదం ఉచ్ఛరిస్తూ వేలాది మంది జైళ్ళకు వెళ్ళివుండవచ్చు. ఉరికంబాలకు నడిచివుండవచ్చు. కానీ ఈ గేయం ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొన్ని జాతులు నిరసన గళం ఎందుకు విప్పవలసి వచ్చిందో, మరికొంత మందికి పూనకం ఎందుకు వస్తుందో తరచిచూడాలి.

‘వందేమాతరం’ కానీ, జాతీయగీతం ‘జనగణమన’ కానీ దేశం కోసం రాసినవి కావు. వందేమాతరం బంకించంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠ్‌’ నవలలో బ్రహ్మచారుల మఠం ప్రార్థన గీతం. ఇక జనగణమన, 1911లో మన దేశంలో జరిగిన 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్బంగా రవీంద్రుడు మధనపల్లి థియోసాఫికల్‌ వసతి గృహంలో కూర్చుని రాసిన గీతం – చక్రవర్తికి నివాళులర్పిస్తూ. గీతం ‘అధినాయకుని’ ఉద్దేశించి రాసినది.

ఆనంద్‌మఠ్‌ మొదట (1880-82 సంవత్సరాల మధ్య) ‘వంగదర్శన్‌’ అనే బెంగాలీ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. ఆ నవలలో బంకించంద్ర చటర్జీ మహ్మాదీయ పాలకులకు వ్యతిరేకంగా ‘సంతానులు’గా వ్యవహరించబడే సన్యాసులు సాగించిన పోరాటాన్ని వర్ణించాడు. బ్రిటీష్‌ పాలకులపై తిరుగుబాటుగా నవల రాస్తే, నాటి పాలకులు దాన్ని నిషేధిస్తారని భయపడి, ఇలా రాశారని సమర్థించుకోజూసినా బ్రిటీష్‌పాలన భారతదేశంలో సుస్థిరం కావాలని ఈ నవల ఆకాంక్షించిన విషయం బహిరంగ సత్యం. ఈ నవలలోని సన్యాసులు ఎవరో కాదు ‘మహామాత’ బిడ్డలు. బెంగాలీలకు మహామాత అంటే ‘కాళికాదేవి’ అని వేరే చెప్పనవసరం లేదు. ”అదర్వణ వేదంలోని పృధివీ సూక్తంలో భూమిని తల్లిగా, ఆ భూమిపై నివసించేవారిని ఆమె పుత్రులుగా అభివర్ణించారు. ‘మతా భూమి: పుత్రోహం పృథివ్వా:’ (ఈ పుడమి నా తల్లి నేను ఆమె పుత్రుడను) అనే ఈ భావన హిందూ సంస్కృతిలో ప్రధానమైన అంశం. భారతీయుల్లో నెలకొన్న నిరాశను తొలగించి మాతృభూమి కొరకు సర్వస్వాన్ని సమర్పించే విధంగా జాతి జనులను జాగృతం చేసేందుకు హిందూ భావనలోనుంచి పుట్టిన గీతమే వందేమాతరం.

వంగదర్శన్‌ సాహిత్య మాస పత్రిక

బంకించంద్రుని తత్వాన్ని అర్థంచేసుకొన్న బిపిన్‌చంద్రపాల్‌ ”హిందువులు ఆరాధించే దేవతల సమిష్టి రూపమే భారతమాత’ ఆ మాతకు ప్రతికే వందేమాతరం అని 1909లో స్పష్టంగా ప్రకటించారు. ఆరు చరణాలతో బంకించంద్ర చటర్జీ రాసిన ఈ గేయాన్ని 1896లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారిగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఆలపించారు.

1905 బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంతో ఆ గీతం ఊపందుకుంది. అయితే ముస్లింలకు ఈ గీతం ఎందుకు వ్యతిరేకం అనేది ఆలోచించాలి. మత దృక్కోణంలో జాతీయతకు దీప్తి కలిగించడానికి ”వందేమాతరం’ ఉపయోగపడినప్పటికీ ఈ గీతంలోని ‘హిందూ మత’ కోణాన్ని మొదటి నుంచి ముస్లిం సమూహాం వ్యతిరేకిస్తూనే వచ్చింది. వందేమాతరం’ జాతీయ గీతంగా చూపించడంలో కాంగ్రెస్‌ వైఖరి మొండిగానూ, ఇస్లాం వ్యతిరేకంగానూ, విగ్రహారాధనతత్వంగానూ, సరి అయిన జాతీ వికాసానికి వినాశకరంగానూ భావిస్తూ దానిని ఈ అఖిల భారత ముస్లింలీగ్‌ సమావేశం దృఢంగా గర్హించి, దేశంలోని వివిద ప్రజాసంస్థల యొక్క శాసనసభల యొక్క సభ్యులను మిక్కిలి అక్షేపణీయమైన ఈ గీతంతో సంబంధం పెట్టుకోవద్దని కోరింది. సంస్థ నిర్ణయానికి అనుగుణంగా 1937 జులై 15న మద్రాసు శాసనసభలో వందేమాతరం గీతం పాడినప్పుడు ముస్లింలీగ్‌ సభ్యుడు షేక్‌ మహ్మద్‌ లాల్‌జన్‌ సభను బహిష్కరించి వాకౌట్‌ చేశాడు.

ఈ పరిస్థితిలో 1937 అక్టోబర్‌ మాసాంతంలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో ‘వందేమాతరం’లోని మొదటి రెండు పాదాలను మాత్రమే పాడాలని, వందేమాతరం బదులు నిరాక్షేపణీయమైన మరే ఇతర గీతాన్నైనా పాడుకొనేందుకు పూర్తి స్వాతంత్య్రం వుండాలని’ సిఫారసు చేసింది.

ప్రస్తుతం పాడుకుంటున్న వందేమాతరం చరణాలు

దుర్గా మాతను కీర్తించే తర్వాతి చరణాలను వదిలిపెట్టి ఆ ప్రస్థావన లేని మొదటి రెండు చరణాలనే తీసుకున్నప్పటికీ ముస్లింలు ఈ గీతాన్ని ఆలపించేందుకు నిరాకరించారు. మాతృభూమి భావనను కీర్తించడం కూడా తమ మత నియమాల ప్రకారం ‘షిర్క్‌’ (విగ్రహారాధన నేరం) అని వారు పేర్కొన్నారు.

ఆధునిక ముస్లిం స్కాలర్‌, మతబోధకుడు జాకీర్‌ నాయర్‌ ఈ వందేమాతరం గురించి చెబుతూ ‘ఈ వందేమాతరం గీతం 12 పదాలు, వర్ణనలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయంటాడు. ఇది కేవలం ముస్లింకే కాకుండా వేదాల్లో బోధించే దేవుడికి ఆకారం లేదు అనే సిద్ధాంతానికి కూడా వ్యతిరేకమే అంటాడు. ఇస్లాంను కేవలం భారతీయులు మాత్రమే కాదు, ఇస్లాంను నమ్మే ఏదేశస్తులు కూడా తమ మాతృభూమికి నమస్కరించరని సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లను ఉదహరిస్తాడు. తొమ్మిది నెలలు గర్భంలో మోసి జన్మనిచ్చిన మాతృమూర్తి నమస్కరించడం కూడా ఇస్లాం కు వ్యతిరేకమైనప్పుడు ఇక ఈ దేశాన్ని నమస్కరించడం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నిస్తాడు.

జాకీర్‌ నాయర్‌

అయితే ముస్లిం లీగ్‌ ప్రతినిధులు ఈ గీతంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కాలంలోనే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 1937లో సుభాష్‌ చంద్రబోస్‌కు రాసిన లేఖలో ”బంకించంద్ర చటర్జీ రాసిన గేయం సాహిత్యపరంగా గొప్పది. అది నిలిచి ఉంటుంది కానీ పది తలలున్న దుర్గని ముస్లింలు ఎలా తమ మాతృభూమి అనుకుంటారు” అని రాసిన లేఖ ముస్లిం సమూహానికి బలం చేకూర్చిందనే చెప్పవచ్చు.

ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ దేశ స్వాతంత్య్రం అనంతరం 1950 జనవరి 20న ‘జనమనగణ’ ను జాతీయ గీతంగా ప్రకటించి, దానితోపాటు వందేమాతరానికి కూడా సమానహోద ఇచ్చి గౌరవించారు.

జనగనమణని జాతీయ గీతంగా గుర్తించినా, వందేమాతరానికి ఆ హోదాగా ఇచ్చినా ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఆలపించాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. అయినప్పటికీ ఈ గీతం చూట్టూ నేటికి రాజకీయాలు నడుస్తున్నాయి. ‘వందేమాతరం’ పాడాల్సిందేనని, నినాదం ఇస్తేనే ఈ దేశంలో ఉండాల్సిందని హుఖుం జారీ కూడా చేస్తున్నారు.

దీనికి ప్రతిగా ‘నా గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదాన్ని చేయను’ అనే బలమైన వాణికూడా వినిపించింది. ”భారత్‌ మాతాకీ జై’ అని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని, నా గొంతుమీద కత్తిపెట్టిన ఆ నినాదం చేయను అని ఎఐఎంఐఎం ఎపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నాడు ఓ సందర్భంలో.

దురద్రుష్టవశాత్తు రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాల్సిన వ్యవస్థలు కూడా దాన్ని విస్మరిస్తున్నాయి. మెజారిటీ నిర్ణయానికి కట్టుబడే తమ విధులను నిర్వహిస్తున్నాయి.

బిజో ఎమాన్యుయేల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో (1986) సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక విశిష్టమైన తీర్పు జాతీయ గీతం/ గేయం పట్ల పూర్తి స్పష్టత కల్పిస్తోంది. క్రిస్టియన్‌ మతంలో ‘జాషువా విట్‌సెసెస్‌’ అనే తెగకు చెందిన ముగ్గురు పిల్లలు తాము చదువుతున్న పాఠశాలలో తమ మత విశ్వాసాలకు అది విరుద్దమని అందరితోపాటు జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించడానికి నిరాకరించారు. మొదట వారి వాదనలతో ఏకీభవించిన స్కూలు యాజమాన్యం కేరళ శాసనసభ జోక్యంతో చర్య తీసుకొన్నది. ముగ్గురు విద్యార్థులనూ పాఠశాల నుంచి బహిష్కరించింది. ఆ పిల్లల తండ్రి బిజో ఎమ్మానుయేల్‌ కేరళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా స్కూల్‌ యాజమాన్యం వైఖరికే మద్దతు లభించింది. అయితే ఆ తండ్రి సుప్రీం కోర్టులో అప్పీలు చేశాడు. జస్టీస్‌ ఓ. చిన్నపరెడ్డి, జస్టీస్‌ ఎం.ఎం. దత్తలతో కూడిన ధర్మాసనం ఆ ఆప్పీలును విచారించి, ”మతపరమైన సరైన అభ్యంతరం ఉన్న పక్షంలో, అందరితోపాటు వారిని కూడా జాతీయ గీతం ఆలపించాల్సిందేనని బలవంతం చేయడం కుదరదని ధర్మాసనం తీర్పు చెప్పింది. అలా బలవంతం చేయడం ఆర్టికల్‌ 19(1) (ఎ) – భావటన స్వేచ్ఛ – ఆర్టికల్‌ ప్రకటన స్వేచ్ఛ – ఆర్టికల్‌ 25(1) మత స్వేచ్చకు విరుద్దమని” స్పష్టం చేస్తూ, మౌనంగా ఉండటం కూడా భావ ప్రకటన స్వేచ్చలో భాగమేనని తీర్పు వెలువరించిన జస్టిస్‌ చిన్నపరెడ్డి పేర్కొన్నారు.

2006, ఆగస్టు 22న దేశంలోని ఉభయ సభలలో విస్తృత చర్చ జరిపి పాఠశాలలో వందేమాతరం తప్పనిసరి కాదని తేల్చాయి. కానీ ఈ చట్టాలు, తీర్పులు మెజారిటీ భావజాలం ముందు ఓడిపోతూనే ఉన్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్దది, గొప్పదైన రాజ్యంగం అని చెప్పుకుంటున్నప్పటికీ ఎంత అప్రధారమైన మైనారిటీలయినా ఈ దేశపు రాజ్యాంగం కింద తమ గుర్తింపును తాము పొందగలగడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష. కానీ ఈ దేశ రాజ్యంగం పదే పదే ఈ పరీక్షలో విఫలమవుతూనే ఉంది.

ఫలానా పని చేసిగానీ, ఫలానా మాట అని గానీ తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సందిగా డిమాండ్‌చేసే హక్కు ఎవరికైనా ఎక్కడ నుంచి సంక్రమిస్తుంది? అలాంటి హక్కును తమకు తాము దఖలు పరుచుకున్న కొందరు, దేశభక్తికి ప్రతీకగా ఫలానా నినాదం చేయాలనిపట్టుపట్టినపుడు చట్టసభలు అందుకు వంతపాడతున్నాయి (‘భారత్‌మాతాకీ జై ‘ అనే నినాదం చేయనందుకుఎంఐఎం మహారాష్ట్ర శాఖ నేత, ఆ రాష్ట్ర ఎమ్యెల్యే వారిస్‌ పఠాన్‌పై అసెంబ్లీలో సస్పెన్షన్‌ విధించారు).

‘భారతమాతాకి జై’ లేదా ‘వందేమాతరం’ అన్నవి కేవలం ఒక నినాదానికి సంబంధించి విషయం కాదు. అందులో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశం ఇమిడి ఉంది.

రాచరికం అమలులో వున్న నిజాం పరిపాలనలో ‘వందేమాతరం’ నినాదం ఇవ్వడం మత వైషమ్యాలను రెచ్చగొడుతుందని అభ్యంతరం చెబితే, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య కాలంలో ‘వందేమాతరం’ పాడకుంటే ఈ దేశంలో ఉండకూడదు, వాళ్లను దేశంనుంచి బహిష్కరించాలి అనే వైఖరీ రోజు రోజుకూ బలపడుతుంది. భావటన స్వేచ్ఛను, వాక్‌ స్వాతంత్య్రాన్ని గౌరవించని ఏ పాలనలోనైనా ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే వుంటారు. నాటినుంచి నేటి వరకు జరుగుతున్నది అదే.

Search

Latest Updates

Subscribe

Subscription Form