న్యూ ఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ మరో ఏడుగురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ షాలిందర్ కౌర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పును ప్రకటించింది. ఇతర నిందితుల్లో అథర్ ఖాన్, ఖలీద్ సైఫీ, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షిఫా ఉర్ రెహమాన్, మీరాన్ హైదర్, గుల్ఫిషా ఫాతిమా, షాదాబ్ అహ్మద్ ఉన్నారు.
ఈ కేసులో తమకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను నిందితులు సవాలు చేశారు. నిందితుల తరపున సీనియర్ న్యాయవాది త్రిదీప్, సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్,తాలిబ్ ముస్తఫాలు తమ వాదనను వినిపించారు.
విచారణల సమయంలో ఉమర్ ఖలీద్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది త్రిదీప్ పైస్ .. ఎటువంటి సందేశం పంపకుండా కేవలం వాట్సాప్ గ్రూపులలో ఉండటం నేరం కాదని వాదించారు. వాట్సాప్ గ్రూపులో వున్నంత మాత్రాన నేరం ఎలా అవుతుందని ప్రశించారు.
ప్రాసిక్యూషన్ పేర్కొన్నట్లుగా 2020 ఫిబ్రవరి 23-24 రాత్రి జరిగినట్లు చెప్పబడుతున్న సమావేశం రహస్యం ఏమీ కాదని కాదని, పైగా ఆ సమయంలో ఆయన అక్కడ లేనే లేడని, అరెస్టు సమయంలో ఖలీద్ నుండి డబ్బు లేదా ఇతరత్రా ఎటువంటి రికవరీ జరగలేదని పైస్ వాదనలు వినిపించారు.
ఖలీద్ సైఫీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ … నిరపాయకరమైన సందేశాల ఆధారంగా లేదా కట్టు కథనాల ఆధారంగా UAPA కింద విచారించి, సుదీర్ఘ కాలంగా బెయిల్ నిరాకరించవచ్చా అని ప్రశ్నించారు. ఇదే కేసులో సహ నిందితులుగా వున్న ముగ్గురు జూన్ 2021లో బెయిల్‌పై విడుదలైనట్లుగానే సైఫీ బెయిల్‌పై విడుదలకు అర్హుడని జాన్ వాదనలు వినిపించారు.
ఢిల్లీ పోలీసులు ఆరోపించినట్లుగా తన క్లైంట్ ఎలాంటి కుట్రకు పాల్పడలేదని, కుట్ర సమావేశాలలో భాగం కాదని, సహ నిందితులందరితో ఎవరితోనూ ఎన్నడూ సంబంధం కలిగిలేడని షార్జీల్ ఇమామ్ తరపున సీనియర్ న్యాయవాది తాలిబ్ ముస్తఫా వాదనలు వినిపించారు.
ఢిల్లీ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన ఎస్జీఐ తుషార్ మెహతా బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ, ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడమే నిందితుల ఉద్దేశమని మెహతా అన్నారు. దాని కోసం ఒక ప్రత్యేక రోజును ఎంచుకోని దమనకాండకు పాల్పడ్డారన్నారు.
