బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం పోలీసుల ముందు 24 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వారిలో 14 మందిపై మొత్తం రూ. 28.50 లక్షల రివార్డు కూడా ఉందని జిల్లా ఎస్సీ జితేందర్ కుమార్ యాదవ్ తెలిపారు.
తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ కొండల్లో ఏప్రిల్ 21నుండి దాదాపు 24000 మంది భద్రతా బలగాలతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టడంతో వారంతా లొంగిపోయారని, వారిలో 11 మంది మహిళా నక్సల్స్ కూడా ఉన్నారని ఆ అధికారి వివరించారు.
లొంగిపోయిన నక్సల్స్‌లో సుద్రు హేమ్లా(33), ఊర్మిళా(36), జయ్‌మోతి పుణెం(24), మంగు పుణెం(21), శామ్‌నాథ్ కుంజం(40), చైతు కుర్సం(30), బుచి మాధ్వి(25), సుక్మతి ఉర్సా(28), సోమ్లి హేమ్లా(45), బుజ్జి పదం(20), సుక్కో పుణెం(28), హిడ్మె వెకో(22), సోని కొర్సా(30), లచ్చ తతి(25) ఉన్నారు. లొంగిపోయిన ఈ నక్సల్స్ అందరికీ ప్రభుత్వ పాలసీ ప్రకారం రూ. 50 వేల చొప్పున ఒక్కొక్కరికి అందించడమేకాక, పునరావాసం కల్పించనున్నారని ఎస్సీ తెలిపారు.
