- పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మృత దేహాలు తరలింపు.
హైదరాబాద్ : తెలంగాణ – చత్తీస్ గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు పోలీసుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
ఛత్తీస్ గడ్ – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో గత రెండు వారాలుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం ములుగు జిల్లా వాజేడు పరిసరాల్లోని లంకపల్లి అడవిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో కూబింగ్ నిర్వహించిన పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ పేలుడు దాటికి ముగ్గురు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ చనిపోగా, ఒక ఆర్ఎస్ ఐ గాయపడ్డారు. చనిపోయిన కానిస్టేబుల్స్ సందీప్, పవన్ కళ్యాణ్ , శ్రీధర్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆర్‌ఎస్‌ఐ రణధీర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
మృతి చెందిన పోలీసులకు నివాళి అర్పించేందుకు డీజీపీ డాక్టర్ జితేందర్, అదనపు డీఎస్పీ (గ్రేహౌండ్స్) ఎం. స్టీఫెన్ రవీంద్రతో పాటూ ఉన్నతాధికారులు వరంగల్ చేరుకున్నట్లు సమాచారం. వారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌తో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
