Chennai: ఆలయాల కుంభాభిషేకంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకు పాల్గొనడం లేదని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందర్‌రాజన్ ప్రశ్నించారు. రాణిపేట జిల్లా షోలంగర్‌లోని యోగ నృసింహ్వామి ఆలయ కుంభాభిషేకంలో కుటుంబ సభ్యులతో తమిళిసై పాల్గొన్నారు. తొలుత రోప్ కార్ ద్వారా కొండ ఆలయానికి వెళ్లిన తమిళిసైకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ‘57 సంవత్సరాల తర్వాత నిర్వహించిన యోగ నృసింహస్వామి కుంభాభిషేకంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పలు ఆలయాల్లో జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, కుంభాభిషేకాలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో, ఆలయ కుంభాభిషేకాల్లో ముఖ్యమంత్రి ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు శుభాకాంక్షలు తెలిపే సీఎం స్టాలిన్, హిందువుల పండుగలకు శుభాకాంక్షలు చెప్పకపోవడం సమంజసం కాదన్నారు. షోలింగర్ కొండలపై చెట్లు నరికే ఘటనలు అడ్డుకోవాలని’ తమిళిసై డిమాండ్ చేశారు.
