న్యూస్‌క్లిక్ ఎడిటర్(NewsClick Editor) ప్రభిర్ పుర్‌కయస్తను తక్షణమే రిలీజ్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉగ్రవాద చట్టం కింద అతన్ని అక్రమంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు కోర్టు వెల్లడించింది. జస్టిస్ బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసులో రిమాండ్ కాపీని ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది. ఎందుకు అరెస్టు చేశారన్న అంశానికి సంబంధించిన విషయాలను కోర్టుకు వెల్లడించలేదని, పంకజ్ బన్సల్ కేసు తరహాలో అతన్ని కస్టడీ నుంచి రిలీజ్ చేయాలని ఆదేశిస్తున్నామని, రిమాండ్ ఆర్డర్ చెల్లదని జస్టిస్ మెహతా తెలిపారు.
పుర్‌కయస్తను గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేశారు. చైనా ఏజెండా గురించి కథనాలు రాస్తున్న న్యూస్‌క్లిక్ సంస్థకు అక్రమంగా నిధులు వస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆరోపణలు చేసింది. ఆ కేసులో న్యూస్‌క్లిక్ ఎడిటర్‌ను అరెస్టు చేశారు. చైనాకు అనుకూలంగా రాసేందుకు టెర్రర్ ఫండింగ్ జరిగినట్లు 8వేల పేజీల ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. న్యూస్‌క్లిక్ హెచ్ఆర్ అధిపతి అమిత్ చక్రవర్తిని కూడా అక్టోబర్ 3వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే.