TS: తోటి ఉద్యోగినిని రివాల్వర్ చూపెట్టి అత్యాచారానికి పాల్పడిన కీచక ఎస్సైని సస్పెన్షన్ చేశారు ఉన్నతాధికారులు. సర్వీసు రివాల్వర్‌ను తీసుకొని శాఖపరమైన విచారణకు ఆదేశించారు.
వివరాల్లొకి వెళితే, భూపాలపల్లి జిల్లాలో ఎస్సైగా పనిచేస్తున్న భవానీ సేన్ కన్ను తోటి ఉద్యోగినిపై పడింది. హెడ్ కానిస్టేబుల్‌ను తన కోరిక తీర్చాలని వేధించాడు. ఒప్పుకోలేదని సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించాడు. రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదనపడిన ఆమె ఆత్మహత్యకు సైతం సిద్ధపడింది. అలా చేస్తే తనలాంటి ఎందరో ఆడవాళ్లు వాడి కామవాంఛకు బలవుతారని భావించి చివరకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఖాకీలు కంగుతిన్నారు.
బాధితురాలి ఫిర్యాదుతో ఎస్సైను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ ఐ దగ్గర నుంచి సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అతనిపై గతంలోనూ వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడు మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పనిష్మెంట్ కింద ఎస్సై భవాని సేన్‌ను అధికారులు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయినా ఆ ఎస్సై కీచక బుద్ధిని మార్చుకోలేదు.