166 మంది అస్తికలతో అంతరిక్షంలోకి వెళ్లిన ఓ స్పేస్ క్యాప్సూల్ పసిఫిక్ సముద్రంలో కూలింది. భూమి చుట్టు రెండు సార్లు విజయవంతంగా కక్ష్యలో చక్కర్లు కొట్టిన ఆ క్యాప్సూల్ ఆ తర్వాత క్రాష్ అయ్యింది.
జర్మనీ స్టార్టప్ కంపెనీ ద ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ జూన్ 23వ తేదీన ఎన్‌వైఎక్స్ అనే క్యాప్సూల్‌ను నింగిలోకి పంపింది. మిషన్ పాజిబుల్ అనే ప్రోగ్రామ్‌లో భాగంగా దాన్ని ప్రయోగించింది. టెక్సాస్‌కు చెందిన సెలిస్‌టిస్ అనే కంపెనీ మనుషుల అస్తికలను భూకక్ష్యలోకి పంపే ప్రాజెక్టు చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. విజయవంతంగా పేలోడ్‌లను కక్ష్యలోకి పంపామని, లాంచర్‌తో వేరైన తర్వాత భూకక్ష్యలోకి రీఎంట్రీ ఇచ్చిందని, ఆ తర్వాత పరిస్థితులు చేజారినట్లు కంపెనీ తన ప్రకటనలో పేర్కొన్నది. తిరుగు ప్రయాణ సమయంలో సంకేతాలు తెగిపోయినట్లు చెప్పింది. ఈ సమస్యకు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
2023లో నాసా ఆట్రోనాట్ ఫిలిప్ కే చాప్మన్ అస్తికలు తీసుకెళ్తున్న వేళ రాకెట్ పేలిన విషయం తెలిసిందే. అస్తికలు కోల్పోయిన కుటుంబసభ్యలుకు సెలిస్‌టిస్ కంపెనీ కూడా సంతాపం ప్రకటించింది.
