TG: సింగరేణి విస్తరించి ఉన్న కోల్ బెల్ట్ ప్రాంతంలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలు, స్థానిక యువతకు దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి వారిని ఉన్నత స్థానాల్లో నిలిపేలా ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు “చెమట చుక్కలకు తర్ఫీదు” పేరిట సింగరేణి యాజమాన్యం కొత్త పథకానికి రూపకల్పన చేసింది.
ఈ పథకానికి సంబంధించిన లోగోను రాష్ట్ర సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల పిల్లలు కేవలం కార్మికులుగానో లేదా ఇతర చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలపై వర్కుషాప్ లు, సెమినార్లు, కెరీర్ గైడెన్స్ వంటి కార్యక్రమాలను నిపుణులతో సహకారంతో సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్నారు.