ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కృష్ణ కుమారి రాయ్ అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరఫున నామ్చి సింగితాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఏం అయిందో తెలీదు. కానీ ఆ మరుసటి రోజు గురువారం తనపదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదం తెలిపినట్లు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ తెలిపారు.
కృష్ణ కుమారి రాయ్ రాజీనామా విషయంపై సోషల్ మీడియా వేదికగా సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ స్పందించారు. ‘ నాజీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక అభినందనలు.’ తెలుపుతూ రాసుకొచ్చారు.