Bengaluru: నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతోపాటు బోర్డులు, కార్పొరేషన్‌ల అధ్యక్ష నియామకాలకు సంబంధించి అధిష్టానతో చర్చించేందుకు సీఎంతో కలసి ఢిల్లీ వెళ్లనున్నట్టు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం సదాశివనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన అధిష్టానంతో భేటీ అయి అన్ని విషయాలు చర్చిస్తామన్నారు. ధర్మస్థళ వివాదానికి సంబంధించి సమగ్ర సమాచారం లేదని దాటవేశారు. సీనియర్ అధికారులతో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారన్నారు.
విచారణ ముగిసేదాకా మాట్లాడరాదన్నారు. బీజేపీ వారు ఏమైనా చెబుతారన్నారు. కోర్టు ముందు ఓ వ్యక్తి పలు అంశాలు ప్రస్తావించారని, వాటి వాస్తవాలపై దర్యాప్తు సాగుతోందన్నారు. మీడియాలో ఎక్కువగా కథనాలు వస్తున్నాయన్నారు. జీఎస్టీ నోటీసుల విషయమై మాట్లాడుతూ బీజేపీ వారు అరటిపండు తిని మా నోళ్లకు పూసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2019లోనే ఏడాదికి రూ.40లక్షల లావాదేవీల పరిమితిని విధించిందన్నారు. రాష్ట్రప్రభుత్వాలు పాటించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే 14వేలమందికి నోటీసులు ఇచ్చారన్నారు. కేంద్ర కమిటీ ఒత్తిడి మేరకే నోటీసులు జారీ అయ్యాయన్నారు. కాగా మంగళవారం నుంచి 3 రోజులపాటు అందుబాటులో ఉండడన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఎవరినీ కూడా భేటీ కాలేనన్నారు. ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరాదన్నారు.
