దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. యూఎస్ సుంకాల ఉద్రిక్తతలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో మార్కెట్లు నిదానంగా కదలాడాయి. భారత్-యూఎస్ వాణిజ్య చర్చలు నిలిచిన నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. మార్కెట్లు ఉదయం నష్టాల్లో మొదలైనా.. చివరి సెషన్‌లో కోలుకోవడంతో లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,387.03 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 83,320.95 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 83,812.31 పాయింట్లకు పెరిగింది. చివరకు 270.01 పాయింట్ల లాభంతో 83,712.51 వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ సైతం 61.20 పెరిగి 25,522.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,889 షేర్లు లాభాల్లో కొనసాగగా.. 1,990 షేర్లు నష్టాల్లో ముగిశాయి. విస్తృత మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్‌ల లాభాలతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ దాదాపు 60 బేసిస్ పాయింట్లు లాభపడింది. ఐటీ, రియాలిటీ, మీడియా సూచీలు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు, ఫార్మా, పబ్లిక్ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్‌లు పడిపోయాయి.
