అగర్తల: గిరిజనేతర పురుషులను వివాహం చేసుకున్న గిరిజన మహిళలకు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) ప్రయోజనాలను రద్దు చేయాలని త్రిపుర ఎమ్మెల్యే, తిప్రా మోతా పార్టీ తిరుగుబాటు నాయకుడు రంజిత్ దేవ్ వర్మ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సిఎస్‌టి)ను కోరారు.
ఆగస్టు 12న ఎన్‌సిఎస్‌టి రాసిన లేఖలో, చాలా మంది గిరిజనేతరులు పన్నులను ఎగవేసేందుకు, గిరిజన హక్కులను దుర్వినియోగం చేయడానికి ఇటువంటి వివాహాలను ఒక లొసుగుగా ఉపయోగిస్తున్నారని దేవ్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
షెడ్యూల్డ్ తెగలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందడానికి గిరిజనేతర పురుషులు పెద్ద సంఖ్యలో ఉద్దేశపూర్వకంగా గిరిజన మహిళలను వివాహం చేసుకుంటున్నారని దేవ్ వర్మ పేర్కొన్నారు. వివాహం చేసుకున్న తర్వాత, గిరిజనేతరులు చట్టబద్ధమైన పన్నులు చెల్లించకుండా ఉండటానికి వారి వ్యాపారాలు, ఆస్తులను గిరిజన భార్యలకు బదిలీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పెట్రోల్ పంపులు, గ్యాస్ ఏజెన్సీలు, రేషన్ దుకాణాలు ఇతర వాణిజ్య సంస్థలు ఇప్పుడు పన్నులను దాటవేయడానికి ST మహిళల పేర్లతో పనిచేస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గిరిజనేతర పురుషులు సబ్సిడీలను పొందుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలి (TTAADC) అధికార పరిధిలో గిరిజనేతర వ్యక్తలు విస్తారమైన భూమిని సంపాదించి, తోటపని, రబ్బరు తోటలు, ఇటుకల తయారీకి ఉపయోగిస్తూ పన్నుల నుండి తప్పించుకుంటున్నారని దేవ్ వర్మ విమర్శించారు.
గిరిజనేతరుల చర్యల వల్ల గిరిజన సంక్షేమ పథకాల లక్ష్యాలు దెబ్బతీంటున్నాయని, పెద్ద ఎత్తున దుర్వినియోగానికి గురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి వెంటనే చర్య తీసుకోవాలని ఆయన కమీషన్‌ని కోరారు.
గిరిజనేతర పురుషులను ఇప్పటికే వివాహం చేసుకున్న గిరిజన మహిళలకు ST ప్రయోజనాలను రద్దు చేయాలని కోరారు. దేవ్ వర్మ తన లేఖ ప్రతులను త్రిపుర గవర్నర్, ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి కూడా పంపినట్లు తెలిపారు.
