- నేతలు క్షేత్రస్థాయికి వెళ్లలేదు
- సోషల్‌మీడియానే నమ్ముకున్నారు
- అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు
- క్షేత్రస్థాయి సమస్యలను గాలికి వదిలేశారు
- బీజేపీ ఎంపీలు, మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరు
- స్థానిక నేతలను పక్కనపెట్టి వలస అభ్యర్థులను రుద్దారు
- హిమాచల్‌ప్రదేశ్ ఓటమికి నుండి గుణపాఠం తీసుకోలేదు.
బీజేపీ తీరుపై ఆర్ఎస్ఎస్ నేతలు ఒక్కొక్కరు పెదవి విప్పుతున్నారు. నిన్న ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ మాట్లాడింది మరువక ముందు మరో సీనియర్ నేత ఘాటుగా స్పందించారు. ఈ మాటల తీరును చూస్తుంటే బీజేపీ – ఆర్ఎస్ఎస్‌ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, తాజాగా ఎన్నికల ఫలితాలపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత రతన్ శార్దా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తామన్న అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచిందన్నారు. నేతలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా కేవలం సోషల్‌మీడియానే నమ్ముకున్నారని తన మనసులోని బాధను బయటపెట్టారు. ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్‌లో సంఘ జీవిత కాల కార్యకర్త రతన్ శార్ధా తన అభిప్రాయాలను వెల్లడించారు.
అలాగే ఎన్నికల్లో సంఘ్ స్వయం సేవకుల సహకారం తీసుకోలేదన్నారాయన. అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడమే దీనికి కారణమన్నారు. మోదీ ప్రజా కర్షక శక్తిని చూసి ఆనందించారు. క్షేత్రస్థాయి సమస్యలను గాలికి వదిలేశారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు, మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరని వెల్లడించారాయన.
బీజేపీకి సంఘ్ అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించారు. స్థానిక నేతలను పక్కనపెట్టి బలవంతంగా వలస అభ్యర్థులను రుద్దారని, ముఖ్యంగా ఫిరాయింపుదారులకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పార్లమెంటేరియన్లను పక్కన పెట్టి చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇవన్నీ కలిసి బీజేపీ 240 సీట్లకు పడిపోవడానికి కారణంగా వర్ణించారు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థుల్లో 25 శాతం మంది వలస వచ్చినవారేనని కుండబద్దలు కొట్టేశారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి 30 శాతం పైగానే రెబెల్స్ కారణమని తెలుసుకున్నాక, నేతల్లో ఏ మాత్రం మార్పు రాలేదని విమర్శించారు.