అరుంధతీ రాయ్‌పై ఉపా కేసును ఎత్తివేయాలి: ప్రొ. హరగోపాల్

Published on 

ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్ లపై ఢిల్లీ పోలీసులు మోపిన ఊపా కేసుకు ఎత్తివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.

‘‘అరుంధతి రాయి‌పై ఉపా కేసు – వాస్తవాలు’’ అనే అంశంపై ఓయూ ఆర్ట్స్ కాలేజీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

అరుంధతి రాయ్ రచయిత్రిగా భారతదేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల పైన నిరంతరం తన కలం, గళంతో దేశీయ అంతర్జాతీయ వేదికలపై ప్రజల పక్షాన నిలబడిన అసాధారణమైన రచయిత్రి అని కొనియాడారు. ఆమె రచించిన రచనలు ప్రపంచంలో 45 దేశాల భాషలకు అనువదించారన్నారు. మన దేశంలో ‘బుకర్ ప్రైజ్’ పొందిన మొట్టమొదటి మహిళా రచయిత్రిగా ఆమె చరిత్ర సృష్టించారని, అటువంటి వ్యక్తిపై వలస కాలం నాటి కేసును నమోదు చేయడం భారత ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. వాకింగ్ విత్ కామ్రేడ్స్, బ్రోకెన్ రిపబ్లిక్ లాంటి రచనలు ద్వారా బడా పెట్టుబడిదారుల దోపిడీని ప్రశ్నించిందని, ‘నర్మదా బచావో ‘ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిందని, అందుకే ఆమె భారత పాలక వర్గాలకు కంటగింపుగా మారిందని విమర్శించారు.


ఈ క్రమంలోనే 2010 అక్టోబర్ 21వ తేదీన ఢిల్లీలో జరిగిన “ఆజాది ది ఓన్లీ వే” అనే సదస్సులో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తి గురించి, అక్కడి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి విస్తృతంగా ఆమె ఆ సదస్సులో చర్చించిన కారణంగానే ఆమె పైన సుశీల్ పండిట్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అరుంధతీ రాయ్‌పై కేసును నమోదు చేసిందన్నారు. 14 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఉపన్యాసాన్ని అధారం చేసుకొని ఇప్పుడు దాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

సాధారణ ఎన్నికల్లో బీజేపీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా బీజేపీ పార్టీ బుద్ధి మారలేదని, దేశంలో గత పది సంవత్సరాలుగా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ధ్వజమెత్తారు. తక్షణమే అరుంధతి రాయ్ తదితరుల పైన పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్, విద్యార్థి నాయకుడు రీసర్చ్ స్కాలర్ కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అనేక ప్రజా ఉద్యమాలు, సామాజిక, విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటూ బాసటగా నిలిచిన వారిపై కూడా ఉపా కేసులు మోపారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ అడుగుజాడల్లో నడిచిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యమాలను అణిచివేసి భావ ప్రకటన స్వేచ్ఛను హరించిందన్నారు.

అరుంధతీ రాయ్ ఆదివాసులపై, మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి ఆమె పైన ఉపా కేసు కేంద్ర ప్రభుత్వం పెట్టిందని దానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఓయూ పరిశోధక విద్యార్థి సత్య నెల్లి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీధర్, విద్యార్ధి నాయకులు ఎస్. నాగేశ్వరరావు, పెంచాల సతీష్, వలిగొండ నరసింహ, తాళ్ల అజయ్, రవి నాయక్, సుమంత్, శ్రీనివాస్, అజయ్, భగత్, పవన్, అశ్వన్, రమేష్, కోటి, రుక్మత్ పాషా, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form