పాకిస్థాన్‌కు చెందిన నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 30 ఏళ్లు. కరాచీ లోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం.. కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో అస్గర్ గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే నివసిస్తోంది. గత మూడు వారాలుగా ఆమె స్థానికులకు కనిపించలేదు. గత రాత్రి నటి ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డోర్ కొట్టగా.. సమాధానం లేదు. దీంతో లోపలికి వెళ్లి చూడగా.. నటి శవమై కనిపించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అమె మృతిపై ఎలాంటి అనుమానాలూ లేవని, సహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, అస్గర్ అలీ రియాలిటీ టీవీ సిరీస్ తమాషా ఘర్, జలైబీ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
