బీజేపీపై మాజీ సీఎం ఫైర్

Published on 

చెన్నై: నిన్నటి వరకూ బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించి, అది కుదరక తీవ్ర మనస్తాపంతో వున్న మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృతనేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) తాజాగా తన అక్కసు వెళ్లగక్కారు. గతంలో ఏనాడూ కేంద్రప్రభుత్వాన్ని గానీ, బీజేపీగానీ పల్లెత్తుమాట అనని ఆయన.. తాజాగా రాష్ట్రానికి రావాల్సిన ఎస్‌ఎస్వై నిధులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం చెందారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్రం చర్యల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతోందన్నారు.
అనేక ప్రైవేటు విద్యా సంస్థలు నిధుల సంక్షోభంలో కూరుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో సమగ్ర శిక్ష అభియాన్‌ పథకం కింద తమిళనాడు రాష్ట్రానికి 2024- 25 సంవత్సరానికి గాను రూ.2151కోట్ల ఇవ్వాల్సి ఉంద ని, అయితే, నూతన జాతీయ విద్యా విధానం (త్రిభాషా విద్యావిధానం) అమలుకు తమిళనాడు ప్రభుత్వం సమ్మతించకపోవడం వల్లే నిధులను నిలిపివేసినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌదరి వెల్లడించారని ఓపీఎస్‌ గుర్తు చేశారు. ఈ పథకాన్ని నమ్ముకుని రాష్ట్రంలో 65 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు.

ఈ పథకం నిధులను నిలిపివేయడంతో అనేక ప్రైవేటు పాఠశాలలు నిధుల కొరత ఎదుర్కోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ, పాఠశాలల్లో చేపట్టే పారిశుధ్య పనులకు స్తంభించిపోతాయన్నారు. అంతేకాకుండా, కేంద్రం మొండి వైఖరి కారణంగా విద్యా హక్కు చట్టం కింద ఈ యేడాది ప్రైవేటు పాఠశాలల్లో చేరాల్సిన 25 శాతం మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విద్యా హక్కు చట్టంలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ కూడా అంధకారంలో పడుతుందన్నారు. నూతన విద్యా విధానంపై కేంద్రం పెట్టిన షరతులకు రాష్ట్రం అంగీకరించకపోవడం అనేది కేంద్ర రాష్ట్రాల సమస్య అని అన్నారు. దీన్ని ఓ సాకుగా చూపి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకపోవడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందన్నారు. అందువల్ల సమగ్ర శిక్ష అభియాన్‌ పథకం కింద 2024-25 సంవత్సరానికి విడుదల చేయాల్సిన రూ.2151 కోట్లను తక్షణం విడుదల చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కమిటీ తరపున డిమాండ్‌ చేస్తున్నట్టు ఓపీఎస్‌ వెల్లడించారు.

మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form