రాయపూర్: ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మరోమారు పునరుద్ఘాటించారు. గురువారం రాయపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో మావోయిస్టులు అమర్చిన ఐఇడీల పేలుళ్ల కారణంగా శరీర భాగాలను కోల్పోయి, గాయపడిన బాధితులు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మను కలిశారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండలలో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను కొనసాగించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మా ప్రభుత్వం నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రతి నక్సల్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే లేదా ఆపరేషన్‌ను అడ్డుకునే ఏ ప్రయత్నాన్ని సహించబోమని అన్నారు.
అనేక సంస్థలు నక్సల్ ఆపరేషన్ ఆపడానికి ప్రయత్నిస్తున్నారని, వాళ్లేవరూ గాయపడిన బాధితులను కలవలేదని ముఖ్యమంత్రి సాయి విమర్శించారు. కానీ నేడు చాలా మంది ఇక్కడికి వచ్చి నక్సలిజం వల్ల పడుతున్న ఇబ్బందులను వివరించారని, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌కు తమ సంపూర్ణ మద్దతును తెలిపారన్నారు. ఈ ఆపరేషన్‌ను కొనసాగించడానికి గవర్నర్‌ను కలవబోతున్నట్లు తెలిపారు.
