ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది.
మావోయిస్టుల కుంట ఏరియా కమిటీ కార్యదర్శి వెట్టి మంగ్డు, ఏరియా కమాండ్-ఇన్-చీఫ్ హితేష్ సహా 15-20 మంది సీనియర్ నక్సలైట్లు తొన్లాయ్ అడవుల్లో ఉన్నారనే సమాచారం ఆధారంగా శుక్రవారం రాత్రి ఆపరేషన్ ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే పక్కా సమాచారంతో అక్కడకు వెళ్లగా భద్రతా బలగాలు, మావోల మధ్య కాల్పులు జరిగాయని ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.
మరణించిన నక్సలైట్ దూధి హుంగా (35)గా, మావోయిస్టు కుంటా ఏరియా కమిటీలో ఆర్పీసీ (రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ) మిలీషియా కమాండర్‌గా క్రియాశీలకంగా పనిచేశాడని తెలిపారు. సుక్మా జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్లలో నమోదైన 16 కేసుల్లో హంగా వాంటెడ్ గా ఉన్నాడని, అతని తలపై లక్ష రూపాయల నజరానా ఉందని ఆయన అన్నారు.
ఎన్‌కౌంటర్ స్థలంలో ఒక మజిల్ లోడింగ్ గన్, టిఫిన్ బాంబు, మూడు జిలెటిన్ రాడ్‌లు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ), రెండు కార్డెక్స్ వైర్లు, మావోయిస్టు యూనిఫాం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.