ఆర్టికల్ 370ను రద్దు చేసి ఆరేళ్లు పూర్తి అవుతున్నందున కేంద్రం కీలక ప్రకటన చేయనుందనే వార్తలు వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్‌ను తొలగించి జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రేపటికి ఆరేళ్లు పూర్తి అవుతున్నందున జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా రానుందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో, జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదాపైనే చర్చలు జరుగుతున్నాయనే కథనాలు జోరందుకున్నాయి.
ఈ అంశంపై ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ‘మళ్లీ జమ్ముకశ్మీర్‌కు స్టేట్ హుడ్ ఇస్తారనే వార్తలు నా చెవిన పడ్డాయి. అయితే.. అవి నిజమని నాకైతే నమ్మకం కుదరడంలేదు. రేపు ఏమీ జరగదని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. కాకపోతే అసెంబ్లీ వర్షాకాల సమావేశంలోనే ఈ అంశంపై స్పష్టత వస్తుందనే ఆశాభావంతో ఉన్నాను’ అని ఎక్స్ వేదికగా అబ్దుల్లా వెల్లడించారు.
