శ్రీనగర్: ఢిల్లీ బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ (NIA) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ పేలుడు వెనకున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించి కశ్మీర్‌లోని దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. జమ్ము పోలీసు లతో కలిసి జాతీయ దర్యాప్తు సంస్థ పుల్వామా, షోపియన్, కుల్గాం జిల్లాల్లో సోమవారం దాడులు నిర్వహిస్తోంది. ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌కు ప్రధాన సూత్రధారి అయిన మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ వాగే నివాసంలోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. షోపియన్‌లోని వాగే ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పేలుడు కేసులో వాగేని గత నెల ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.























