నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా తొమ్మిది మంది నక్సలైట్లను రెండు వేరువేరు సంఘటనల్లో బుధవారం అరెస్టు చేసినట్లు బీజాపూర్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
వీరిలో ఐదుగురు నక్సల్స్ గత నెలలో పోలీసు కారును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డ వారుగా పేర్కొన్నారు. గుడ్డు కుమ్మా (25), బుధు కుమ్మా (30), సురేష్ ఓయం (29), వినోద్ కోర్సా (25), మున్నా కుమ్మా (25)లను ఫర్సెగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండెం-కుప్రేల్ గ్రామాల నుండి అరెస్టు చేసినట్లు, ఆ ఐదుగురి తలపై రూ.10,000 చొప్పున రివార్డుగా ఉన్నట్లు తెలిపారు.
మే 15న ఫర్సెగఢ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆకాష్ మసీహ్, కానిస్టేబుల్ సంజయ్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు IEDని ఉపయోగించిన విషయం తెలిసిందే. ఆ పేలుడు ధాటికి పోలీసు వాహనం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ సురక్షితంగా బయటపడ్డారు పోలీసులు.
మరో నలుగురు నక్సలైట్లను మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. మద్దెడ్లోపట్టుబడిన మరో నలుగురిలో లచ్చు పుణేం అనే వ్యక్తి నక్సలైట్ల మద్దెడ్ ఏరియా కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన నక్సల్స్ను కోర్టు ముందు హజరుపరిచినట్లు తెలిపారు.