- పెట్టుబడులకు గమ్యం ఏపీ
- ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు
- ప్రముఖ సంస్థలతో ఒప్పందం
AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో నాలుగో రోజున వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు బృందం భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్ షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణంలతో సీఎం చంద్రబాబు బృందం చర్చించారు.
అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని సమావేశంలో వివరించారు సీఎం చంద్రబాబు. తమ సంస్థ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) ప్రతినిధులు తెలిపారు. వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్సిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్ లేతో చంద్రబాబు మాట్లాడారు.
ఏపీలో ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సముఖుత వ్యక్తం చేశారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్-SMBC మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో సమాలోచనలు చేశారు సీఎం చంద్రబాబు. వివిధ ప్రాజెక్ట్‌ల్లో అవసరమైన ఆర్థిక భాగస్వామ్యంపై SMBC ప్రతినిధితో చర్చించారు. ఫైనాన్స్, ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ వంటి రంగాలపై తాము ఆసక్తితో ఉన్నామని చంద్రబాబుకు వివరించారు SMBC ప్రతినిధి రాజీవ్ కన్నన్.
గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్య ఆరోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై టెమసెక్ హెల్డింగ్స్ ప్రతినిధి దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల విస్తరణకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని దినేష్ ఖన్నా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై ఎంఓయూలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని దినేష్ ఖన్నా హామీ ఇచ్చారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు