AP: తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో నిర్మిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో టీడీపీ కార్యాలయం ఉండాలని పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సూచించారని అన్నారు. ఈ మేరకు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాలా ఖట్టర్‌ను కలిశామని.. ఢిల్లీలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరామని చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ కార్యాలయం కోసం స్థల పరిశీలన జరిగిందని గుర్తుచేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఢిల్లీ వేదికగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు తీరుపై పార్లమెంట్‌లో మాట్లాడానని తెలిపారు. ప్రతి పంటకు బీమా ఉండాలని, పంట నష్టం జరగకుండా చూడాలని కోరామని అన్నారు. వైసీపీ రైతు ప్రభుత్వమని చెప్పింది.. కానీ పూర్తిగా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పంట బీమా క్లెయిమ్‌లో.. అత్యధికంగా 40 శాతం మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని వివరించారు. మొత్తం రూ. 6,604 కోట్ల పెండింగ్ బీమా క్లెయిమ్స్‌లో.. ఆంధ్రప్రదేశ్ రైతులకే రూ.2,565 కోట్లు పెండింగ్‌లో ఉందని వెల్లడించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
