మూసీ నది పునరుజ్జీవనం – ఏం జరుగుతోంది?

Published on 

  • డాక్టర్ బాబూరావు

మూసీకి పూర్వ వైభవాన్ని తెచ్చే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం మూసీ నదీ తీర అభివృద్ధి కార్పోరేషన్ (MRDCL) ఏర్పాటు చేసింది. ఆ లక్ష్య సాధనలోని సవాళ్ళను పరిశీలిద్దాం.

దశాబ్దాలుగా శుద్ధి చేయకుండా మురుగునీరు వదులుతూ మూసీని నగర మురుగునీటి ప్రవాహంగా మార్చారు. నీటి చట్టాన్ని అమలు చేయ వలసిన ప్రభుత్వ సంస్థలే తమ సౌలభ్యం కొరకు మురుగు నీటిని మూసీ లోకి వదిలాయి. ఐడిపిఎల్ ఉత్పత్తి ప్రారంభం నుండి రసాయన కాలుష్యమూ నేరుగా మురుగు నీటి వ్యవస్థ ద్వారా మూసీకి చేరడం జరిగింది. తరువాత ఫార్మా పరిశ్రమ విస్తరించి నియంత్రణ లేకుండా కాలుష్యం పెరిగింది.
ఇంతకు ముందూ వేరు వేరు పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రాజెక్టులు చేపట్టింది. కానీ ఏవీ ముందడుగు వేయ లేదు. ఈ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుండి దాని లక్ష్యాలపై భిన్న వాదనలు పత్రికా ముఖంగా వచ్చాయి.

ఇది మూసీ సుందరీకరణా? ప్రక్షాళనా? పునరుజ్జీవనమా? అన్న వాదనలు వినిపించాయి. కొత్త కార్పోరేషన్ వెబ్సైట్ పై ఎక్కడా నది పునరుజ్జీవనం గురించిన ప్రస్తావన లేదు. ఇచ్చిన పది టెండర్లలోనూ పునరుజ్జీవనం మాట లేదు. నదీ తీర అభివృద్ధి ప్రయోజనాల్లో నీటి నాణ్యత మెరుగు పరచడం వుంది. పునరుజ్జీవనమంటే కేవలం నీటి నాణ్యతే కాదు. నదిని కనీసం 1950 నాటి స్థాయికి చేర్చగలగాలి. ఆనాటి నీటి నాణ్యతా, నీటిలో జీవ వైవిధ్యం పునరుద్ధరించ గలగాలి. అందుకు ఉదాహరణ లున్నాయి. ఐరోపాలో రైన్ నది ఆరు దేశాలలో (స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్) ప్రవహిస్తుంది. స్విట్జర్లాండ్ లోని బాసెల్ నగరంలో 1860 లో గైగీ కంపెనీ అనిలీన్ తో రంగుల తయారీ కంపెనీలను నిర్మించింది. ఒక కంపెనీని ముల్లర్ పాక్ కు లీజు కిచ్చింది.

1862 ఇంకా పెద్ద కంపెనీని కట్టి అతనికే లీజు కిచ్చింది. ఉత్పత్తయ్యే వ్యర్ధాలను పక్కనే వున్న వాగులో పోయడానికి అనుమతి అడిగితే బాసెల్ మునిసిపల్ అధికారులు తిరస్కరించారు. డ్రమ్ములలో నింపి రైన్ నదిలో పోసే ప్రతిపాదననూ అధికారులు తిరస్కరించారు. చెరువు తవ్వి అందులో నింపుతూ వచ్చారు. అవి ఇంకి పక్కని బావి నీళ్ళని కలుషితం చేశాయి. ఆ నీళ్ళు తాగి ఒక రైల్వే ఉద్యోగి అనారోగ్యం పాలయ్యాడు. తరువాత పక్కనే వున్న ఒక సంపన్నుడి ఇంటిలో పని చేసే దంపతులు ఆ నీటితో టీ కాచుకుని తాగి రోగు లయ్యారు. ఆ సంపన్నుడి ఫిర్యాదుతో ఒక మునిసిపల్ అధికారి బావి నీటినీ, కంపెనీలో వ్యర్దాలనీ పరిశీలించి కంపెనీ మూసి వేయాలని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత కూడా నదిలో వ్యర్ధాలు పోయడం కొనసాగింది. 1890 లలో గైగీ, బేయర్, సీబా, బిఎఎస్ఎఫ్ లు బెంజీన్, టాల్వీన్, నాఫ్తలీన్, నైట్రో బెంజీన్ లాటి విష రసాయనాలను రైన్ నదిలో పారబోస్తూనే వున్నాయి. వ్యర్ధాల శుద్ధి ఖర్చు తప్పించు కోవడానికి నదులు స్వయం శుద్ధి శక్తి కలిగి వున్నాయని కొంతకాలం, కాలుష్యాన్ని నీటిలో పోసి పలుచన చేయడం హాని తొలగిస్తుందనీ, ఆర్ధిక ప్రయోజనాల కోసం నదిలో కొంతభాగాన్ని త్యాగం చేయడం అవశ్యమనీ వాదిస్తూ వచ్చాయి కంపెనీలు.

హెక్ స్ట్, సీబా, గైగీ, శాండోజ్ లు హానికర వ్యర్ధాలని తెలిసీ రైన్ నదిలో విసర్జించాయి. హెక్ స్ట్ 1969 ఒలక బోసిన ఎండోసల్ఫాన్ పురుగు మందుతో నదిలోని మిలియన్ల చేపలు చని పోయాయి. శాండోజ్ కంపెనీ అగ్ని ప్రమాదంలో (1986) మంటలార్పే నీటిలో కలిసి పారిన వివిధ పురుగు మందులు రైన్ నదిలోని 90 శాతం పైగా ఈల్ చేపలను చంపేశాయి. తాగు నీటికి రైన్ పై ఆధార పడే ప్రజలకు నీరు లేకుండా పోయింది. పరిశోధకులు ఇది దోపిడీ ఆర్ధిక వ్యవస్థ (predatory economy) ఫలితంగా చెప్పారు. రైన్ నది కాలుష్యానికి నిరసనగా ప్రజా ఉద్యమాలు పెల్లుబికాయి. అప్పుడు జర్మనీ ఆధ్వర్యంలో రైన్ పరీవాహక దేశాలు ఒప్పందం చేసుకుని రైన్ పునరుజ్జీవన ప్రణాళిక 1987 లో ప్రారంభించారు. దానిని మూడు దశలలో అమలు చేశారు. అందుకు మొత్తం $7600 కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. ఇప్పటి డాలరు విలువ ప్రకారం 6 లక్షల 46 వేల కోట్ల రూపాయలు.


మొదటి దశ: 1987 – 89 మధ్య.:
హాని చేసే “ప్రాధాన్య పదార్ధాల” జాబితాను రూపొందించి, అవి ఎక్కడ నుండి ఎంత మోతాదులో వస్తాయో గుణించి వాటి తగ్గింపుకి ప్రతిపాదన సమర్పించడం. పారిశ్రామిక ఉత్పత్తిలోనూ, వ్యర్ధజలాల శుద్ధికీ, అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించాలనే డిమాండ్ తయారు చేయడం. ప్రాధాన్య పదార్థాల లక్షణాలు నిర్వచించి, అవి జల చరాలకు ఎలా హాని చేస్తాయి, ఎంత మేర జీవులలోనూ, నది అడుగు పేరుకు పోయిన బురదలోనూ పేరుకు పోతాయి, వాటి వల్ల తాగునీటి ఉత్పత్తికి వాటిల్లే ప్రమాదమేమిటి నిర్దారించి వివరణ.

రెండో దశ: 1995 వరకూ :
1985 నాటి కాలుష్యం ప్రాతిపదికన ప్రధాన కాలుష్య పదార్ధాలను 50 శాతం తగ్గించడం. భార లోహ కాలుష్యాన్ని 70 శాతం వరకూ తగ్గించడం లక్ష్యం. నదీ గమనంలో వేరు వేరు ప్రాంతాలనుండి చేరే కాలుష్యాలను బేరీజు వేసి వాటినెలా తగ్గించాలో భావనాత్మక వివరణ బాధ్యత.

మూడవ దశ: 2000 వరకూ:
మధ్యంతర పరిశీలన తరువాత అదనపు చర్యలను అమలు పరచడం. మెరుగైన రైన్ నీటి నాణ్యత కోసం ప్రమాద కర పదార్ధాల విడుదలను అడ్డుకోవడం. సమిష్టి కృషి మంచి ఫలితాలనిచ్చింది కాని కాలుష్యం పూర్తిగా తొలగ లేదు. ఇంకా కొత్త రకాల కాలుష్యాలు చేరుతున్నాయి. ఇంకా ఆ ప్రాజెక్టు కొనసాగుతున్నది. ఈ ప్రయత్నాల నుండి మనం పాఠాలు నేర్పుకోవాలి. అందులో ముఖ్యమైనవి. సమగ్రమైన అధ్యయనం: రైన్ నదిలోని కాలుష్యాన్ని గుర్తించి, దానికి తగిన పరిష్కారాలను కనుగొనడానికి విస్తృతమైన అధ్యయనం చేశారు. మూసీ విషయంలో స్థానిక అధ్యయనం కనపడదు. టెండర్లపై ఆధారపడుతున్నారు.

కఠినమైన చట్టాలు: కాలుష్యాన్ని నియంత్రించడానికి కఠినమైన చట్టాలు చేసి అమలు చేశారు. పునరుజ్జీవనంలో ప్రధాన సమస్య పారిశ్రామిక కాలుష్యం. మూసీ నీటిలో ఆంటీబయాటిక్స్ పుష్కలంగా వున్నాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ 2019 లో వ్యర్ధ జలాలలో యాంటీ బయాటిక్స్ కు పరిమితి విధిస్తూ ప్రతిపాదిత నియమావళి ప్రకటించింది. కాని తుది ప్రతిలో పరిమితులు తొలగించింది. ఇపుడు ఎలాటి నియమాలూ లేవు. నీటి శుద్ధికి ప్రాతిపదిక ఏమిటి? ప్రజా సంక్షేమం కంటే పెట్టుబడికి ప్రాధాన్యత నిచ్చి, ఉన్న చట్టాలను కూడా సులభ వ్యాపారమని నీరు గారుస్తున్న ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేయగలవా?

పారిశ్రామిక సంస్కరణ: పరిశ్రమలను ఆధునికీకరించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడాన్ని ప్రోత్సహించారు. పర్యావరణ అనుమతికి ఫార్మా రసాయన పరిశ్రమల సాంకేతికత పరిశీలనే జరగదు. ఉదాహరణకి ఇథనాల్ ఉత్పత్తిలో వెలువడే వాయు కాలుష్యం శూన్యంగా చూపి అనుమతులిచ్చారు. రోజుకి 4400 టన్నుల అమ్మోనియా ఉత్పత్తి ప్రతిపాదనని సాంకేతికత ఎవరిదనీ, ముడి పదార్ధం లభ్యత ఏదనీ అడగకుండానే అనుమతిచ్చారు. ఏడేళ్ళ నుండి ఆ ప్లాంటు పునాది రాయి కూడా వేయ లేదు. ఇలా ఎన్నో ఉదాహరణలు.

ప్రజా భాగస్వామ్యం: రైన్ నది పునరుజ్జీవన ప్రక్రియలో ప్రజల పాత్ర ప్రముఖం. ప్రజా పోరాటాలతోనే ప్రభుత్వాలు దిగి వచ్చి ఒప్పందం చేసుకుని ప్రక్షాళన ప్రణాళిక రచించాయి. ప్రభుత్వాలు నది పునరుద్ధరణ ఆవశ్యకత పై విస్తృత అవగాహనా ప్రచారం చేశాయి. ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహించాయి. మూసీ విషయంలో ఎప్పుడూ ప్రజాస్వామ్య స్పూర్తికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను గుర్తించ లేదు. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. సియోల్ కి వెళ్ళిన బృందం అక్కడి మేయర్ ప్రజలతో నాలుగు వేల సమావేశాలు నిర్వహించాడని ప్రకటించారు. మరిక్కడ ఒక్క సమావేశమైనా జరిపారా?
అన్ని కంపెనీలకూ శూన్య ద్రవ విసర్జన అనుమతులిస్తే మూసీ నదిలో ఇన్ని రసాయనాలెలా చేరుతున్నాయి?
ఫార్మా కంపెనీలు నియమ పాలన లేక విష కాలుష్యం వదులుతుంటే దానిని శుద్ధి చేసే వ్యయ భారం ప్రజలపైనా?
ఫార్మా రసాయనాలను తొలగించకుండా మూసీ పునరుజ్జీవనమవుతుందా?
మూసీ 365 రోజులూ నగర మురుగు నీటితో ప్రవహిస్తుంది. అది రోజూ దాదాపు 20 కోట్ల లీటర్లు. ఆ నీటిని శుద్ధి చేయకుండా పునరుజ్జీవనమెలాగ?
మూసీ పునరుజ్జీవానికి మల్లన్న సాగర్ నీళ్ళెందుకు? కాలుష్యాన్ని పలచన చేయడానికా?

  • రచయిత విశ్రాంత శాస్త్రవేత్త

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form