Hyderbad: సెమీ కండక్టర్ (చిప్ ల తయారీ), దాని అనుబంధ పరిశ్రమలకు అనుకూల వాతావరణం హైదరాబాద్ లో ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం తనతో భేటీ అయన పిటిడబ్ల్యూ గ్రూప్ ఏషియా విభాగం ప్రతినిధులతో మాట్లాడారు. సెమీకండక్టర్(semiconductor) పరిశ్రమకు అవసరమైన విడిభాగాలు, పునర్నిర్మాణం, ఆటోమేషన్, పరికరాలను సరఫరా చేసే ఈ సంస్థకు ప్రాంతీయ కార్యాలయం సింగపూర్ లో ఉంది. పరిశ్రమ ఏర్పాటు చేసే పక్షంలో ప్రభుత్వం విధానాల ప్రకారం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి వారికి వివరించారు. తెలంగాణలో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొదవ లేదని శ్రీధర్ బాబు తెలిపారు. సరైన ప్రతిపాదనలతో వస్తే తమ ఆహ్వానం ఎప్పటికీ ఉంటుందని శ్రీధర్ బాబు వివరించారు.
సెమీకండక్టర్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన ఉన్నట్టు తెలిపారు. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉత్పాదక కేంద్రం మొదటి దశ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్టు పిటిడబ్ల్యు ఏషియా విభాగం ఎండీ టార్ స్టెన్ సెయ్ ఫ్రైడ్ పేర్కొన్నారు.