TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్‌లోకి తీసుకురాలేమని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మరోసారి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనని స్పష్టం చేశారు.
‘రామచందర్‌రావు మరోసారి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చడం అసాధ్యమని అంటున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో రిజర్వేషన్లు పెంచారు. అందువల్ల రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమే. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలుకావో చూస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం’ అని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లోకి తీసుకురాలేం
బీసీలకు 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్‌లోకి తీసుకురాలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టంచేశారు. దానికి సుప్రీంకోర్టు అనుమతించదని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి 46సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్‌బీసీలను తప్పుదారి పట్టిస్తున్నదని, బీసీలను మరోసారి మోసం చేసినందుకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
