ముంబై: శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ నిర్వాహకునిపై తన ప్రతాపం చూపారు. ఈ ఘటన ముంబైలోని ఆకాశవాణి గెస్ట్ హౌస్ లో చోటుచేసుకుంది. క్యాంటీన్ లో తనకు వడ్డించిన ఆహారంలో పప్పు బాగోలేదని, అది తిన్న కొద్దిసేపటికే తనకు అనారోగ్యంగా అనిపించిందని సంజయ్ గైక్వాడ్ చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశంలో సమస్యను లేవనెత్తుతానని ఆయన అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుల్దానా నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన గైక్వాడ్, శాసనసభ్యుల కోసం ప్రభుత్వం కేటాయించిన వసతి గృహం అయిన ఆకాశవాణి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటున్నారు. శివసేనలోని ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న క్యాంటీన్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు సమాచారం. వైరల్ అయిన వీడియోలో గైక్వాడ్ షర్టు, టవల్ ధరించి క్యాంటీని నిర్వాహకునితో గొడవపడుతున్న వీడియో వైరల్ గా మారింది. వీడియోలో కొన్ని సెకన్ల తర్వాత ఆ ఎమ్మెల్యే క్యాంటీన్ నిర్వహకునికి ముఖంపై ఒక పిడిగుద్దు కొడతారు. దీంతో అతను కింద పడిపోతాడు. తర్వాత అతను లేవగానే మళ్లీ అతని చెంపమీద ఎమ్మెల్యే కొడుతూ నా స్టయిల్ ఇదే అంటూ వ్యాఖ్యానించడం వినిపిస్తుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనడం వినిపిస్తుంది. క్వాంటీన్ లో ఆహార నాణ్యతపై తాను రెండుసార్లు ఫిర్యాదు చేశానని గైక్వాడ్ పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక తెగ్గోసేవారికి రూ.11 లక్షలు ఇస్తానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ పై కూడా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
