మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ: మావోయిస్టు జగన్

Published on 

హైదరాబాద్: కాల్పుల విరమణను మరో 6 నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నందున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు జగన్ తెలిపారు. గతంలో కొనసాగిన విధంగానే మా వైపు నుండి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషిచేస్తామన్నారు. ప్రభుత్వం వైపు నుండి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరారు.

సోమవారం ఉదయం పత్రికలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో, గత ఏప్రిల్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్నారనీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందన్నారు. ఈ క్రమంలో గత మే నెలలో మేము ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామన్నారు. ఈ ఆరు నెలల కాలంలో అనుకున్న పద్దతులను మా వైపు నుండి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలాగా వ్యవహరించామని గుర్తు చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేయదానికి ప్రయత్నాలు చేస్తున్నదనీ, ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form