మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మే 30వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. నేటితో కస్టడీ ముగియడంతో మరో పదిహేను రోజులు పొడిగించింది. సిసోడియాను ఈడీ అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు.
అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై జైలులో ఉన్న సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ట్రయల్ కోర్టు మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఫిబ్రవరి నుంచి సిసోడియా బెయిల్ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది.
నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై చేసిన అప్పీల్ ఆధారంగా… ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సిసోడియాపై ఉన్న అభియోగాలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది. మద్యం పాలసీ కేసులో గత ఏడాది మార్చి 9న ఈడీ మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసింది. నాటి నుంచి తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.