శ్రీనగర్: భారతదేశం, పాకిస్తాన్ మధ్య సమస్యలను పరిష్కరించడానికి రాజకీయ జోక్యం చేసుకోవాలని పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు, ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి సైనిక చర్య పరిష్కారం కాదని ఆమె అన్నారు. శుక్రవారం శ్రీనగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రెండు దేశాల నాయకత్వం సంయమనం పాటించాలని, ఒకరిపై ఒకరు దాడులను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
పుల్వామా, పహల్గామ్ రెండు సంఘటనలు ఇరు దేశాలను విపత్తు అంచున ఉంచాయన్నారు. ఇది ఇలాగే కొనసాగితే, మొత్తం ప్రపంచానికి ప్రమాదమన్నారు. కార్గిల్ అయినా, పుల్వామా అయినా, పహ్లాగామ్ అయినా లేదా పఠాన్‌కోట్ అయినా, సైనిక చర్య జరిగినప్పుడల్లా ఏం జరిగిందో మనం చూశామని సమస్య మూల కారణానికి చికిత్స చేయకుండా సైనిక చర్య ఎటువంటి పరిష్కారాన్ని తీసుకురాదన్నారు. రెండు వైపులా సరిహద్దుల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని, ఉద్రిక్తతను తగ్గించాల్సిన అవసరం ఉందని పిడిపి అధ్యక్షురాలు అన్నారు.
ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, పిల్లు, మహిళలు ప్రాణాలు కోల్పోయారని సంయమనం పాటించడం తక్షణ అవసరమని ఆమె కోరారు. జమ్మూ-కాశ్మీర్‌లో పౌరులు ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదని కానీ వారు ప్రస్తుతం భారీ మూల్యం చెల్లిస్తున్నారు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
