నల్లగొండ: నల్లగొండ పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. స్కూలు బస్సులో కింద పడి నాలుగేండ్ల చిన్నారి మరణించింది. జస్మిత అనే చిన్నారి దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నది. గురువారం ఉదయం స్కూలు బస్సులో పాఠశాలకు చేరుకున్నది. అయితే బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తుండగా దానికింద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను పాఠశాల సిబ్బంది ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు విషయం తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
