Hyderabad: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది.
విచారణ సందర్భంగా ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ-రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. ఈ-కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే.. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్ నుంచి వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు.
ఇక.. దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారని.. రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్‌కు వర్తించవని కోర్టుకు తెలిపారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్ధిపొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఫార్మూలా-ఈ కార్ల రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫార్ములా -ఈ ఆపరేషన్స్ సంస్థ సంతకాలు చేశాయని వాదించారు. పురపాలక శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చడం సరికాదన్నారు. ఈ మేరకు పలు హైకోర్టు తీర్పులను సిద్ధార్థ్ దవే ప్రస్తావిస్తూ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు.
వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసిన హైకోర్టు.. ఇవాళ ఉదయం కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. కాగా.. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.