న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి సోమవారంనాడు రాజీనామా చేశారు. టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటేరియన్లతో వర్చువల్ సమావేశం జరిగిన కొద్ది గంటలకే కల్యాణ్ బెనర్జీ రాజీనామా చోటుచేసుకుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో పార్టీ పార్లమెటంటరీ టీమ్‌లో సమన్వయం లోపించడం పట్ల మమతాబెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
తన రాజీనామాపై కల్యామ్ బెనర్జీ మాట్లాడుతూ, పార్టీ ఎంపీల మధ్య సమన్వయం కొరవడిందని వర్చువల్ మీటింగ్‌లో దీదీ (మమతా బెనర్జీ) చెప్పడంతో చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అసలు బాధ్యులైన వారిపై క్రమశిక్షణా చర్య తీసుకోకుండా తనను తప్పుబట్టడం చిన్నబుచ్చడమే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
