బీజాపూర్: బీజాపూర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యకు గురయ్యాడు. జనవరి 1 నుంచి ముఖేష్ కనిపించకుండా పోవడంతో అతని అన్న యుకేశ్ చంద్రకర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముమ్మరంగా తాలింపు చేపట్టారు. ఎట్టకేలకు చంద్రకర్ మృతదేహాన్ని ఈరోజు చట్టన్‌పర కాలనీలోని కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో కనుగొన్నారు.
నక్సల్ ప్రభావిత బస్తర్ డివిజన్ బీజాపూర్ జిల్లాకు చెందిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ జాతీయ ఛానల్ ఆయినా ఎన్డీటీవీతో పాటు సొంత యూ ట్యూబ్ ఛానల్ బస్తర్ జంక్షన్ ను నడుపుతున్నాడు. నక్సల్ ప్రభావిస్త ప్రాంతాల్లో విస్తృతంగా పనిచేస్తూ తన సాహసోపేతమైన కథనాలతో ప్రాచుర్యం పొందిన ముఖేష్ చంద్రకర్ మరణం జర్నలిస్టు శిబిరాన్ని దిగ్రాంతికి గురిచేసింది.
జనవరి ఒకటి దేశం మొత్తం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ ఇంట్లో నుండి బయటకి వెళ్లిన తన సోదరుడు కనిపించకుండా పోవడంతో ముకేష్ సోదరుడు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఇంట్లో నుండి బయటకి వెళ్లిన సమయం నుండి ముకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ హత్య వెనుక కారణం ఏమిటనేది శోధిస్తున్నారు.
కాగా, జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.