AP: జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఛాంబర్ లో పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత పలు దస్త్రాలపై సంతకాలు చేశారు.
పవన్ వెంట ఆయన సోదరుడు, జనసేన పార్టీ నేత నాగబాబు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టినందుకు పలువురు నేతలు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. రేపటి నుంచి పవన్ కల్యాణ్ తన పరిధిలో ఉన్న శాఖలపై పూర్తిగా దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది. వారంలో ఎక్కువ రోజులు సచివాలయంకు వెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ ను పవన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. శాఖల పనితీరుకు సంబంధించి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేలా పవన్ కల్యాణ్ దృష్టి పెట్టనున్నారు.























