ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పేలుడు సంభవించిన మరుసటి రోజే.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో కూడా పేలుడుతో దద్దరిల్లింది. ఈ పేలుడులో 12 మంది మరణించగా.. 27మంది గాయపడ్డారు. ఢిల్లీ మాదిరిగానే పాక్‌లోనూ కారులో బాంబు పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడి అని పాక్ భద్రతాదళాలు తెలిపాయి. అయితే ఈ పేలుడుపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత్‌పై నిరాధార ఆరోపణలు చేశారు. ఇవి భారత్-పాక్ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీశాయి.
ఇస్లామాబాద్‌లోని ఒక కార్యక్రమంలో మాట్లాడిన పాకిస్తాన్ ప్రధాని.. తమ దేశంలో జరిగిన పేలుడు వెనుక భారతదేశ ప్రమేయం ఉందని బహిరంగంగా ఆరోపించారు. దీనిపై భారత్ వెంటనే స్పందించింది. భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ‘‘పాకిస్తాన్ ప్రధాని చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ ఆరోపణలను భారతదేశం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. ఇది ఒక కుట్ర’’ అని మండిపడ్డారు.
పాకిస్తాన్‌లో జరిగిన ఈ పేలుడుకు స్థానిక ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ బాధ్యత వహించింది. అయినప్పటికీ, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాత్రం ఈ ఉగ్ర చర్యలను భారతదేశానికి ముడిపెట్టడం గమనార్హం. ‘‘భారత్ మద్దతుతో ఆఫ్ఘనిస్తాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఈ దాడి చేశారని ఎక్స్‌లో షరీఫ్ ఆరోపించారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచే లక్ష్యంతో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన పిచ్చివ్యాఖ్యలు చేశారు.
ఆ దాడితో లింక్ ఇస్లామాబాద్ పేలుడును సోమవారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని క్యాడెట్ కళాశాల వెలుపల జరిగిన మరో దాడితో కూడా షాబాజ్ షరీఫ్ ముడిపెట్టారు. ఆ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. దానికి కూడా TTP సంస్థనే బాధ్యత వహించింది. రెండు దాడులను ఆఫ్ఘనిస్తాన్ నుండి పనిచేస్తున్న నెట్‌వర్క్ నిర్వహించిందని, దానికి భారత్ రక్షణ కల్పిస్తోందని పాక్ ప్రధాని ఆరోపించారు. భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ ప్రమేయం ఆధారాలతో నిరూపితమైనప్పటికీ, ఎటువంటి ఆధారాలు లేకుండా పాక్ నాయకత్వం భారత్‌పై నిందలు వేయడం కుట్ర అని విదేశాంగ శాఖ కొట్టివేసింది.























