Hyderabad: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శుక్రవారం ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించడం, దీంతో జనవరి ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన నుమాయిష్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, కోశాధికారి డాక్టర్ బి.ప్రభాశంకర్‌లు తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్ల నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.
స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన నుమాయిష్‌లో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతాయి. అందుకే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనగా వ్యవహరిస్తారు. ఈ సారి ఎగ్జిబిషన్ అంతా చుట్టి వచ్చేందుకు డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చారు. 26 ఎకరాల్లో నిర్వహించే నుమాయిష్‌కు ఏటా 25 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పదివేలమందికి ఉపాధి లభిస్తుంది. ఈసారి 2500పైగా స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి.