న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బాంబు పేల్చింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) వైరస్ ఇప్పటికే ‘సర్క్యులేషన్’లో ఉందని హెచ్చరించింది. అయితే దీనిని ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని తెలిపింది. దేశంలో మూడు హెచ్ఎంపీవీ కేసులు నమోదైన నేపథ్యంలో ఐసీఎంఆర్ సోమవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) నెట్వర్క్, ఐసీఎంఆర్ డేటా ప్రకారం ఇన్ఫ్లూఎంజా లేదా తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంలో అసాధారణ కేసుల పెరుగుదల పరిస్థితి దేశంలో లేదని పేర్కొంది. ఈ వైరస్ వ్యాప్తి పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే హెచ్ఎంపీవీ వ్యాప్తి ట్రెండ్‌ను ఈ ఏడాది అంతా ఐసీఎంఆర్ ట్రాక్ చేస్తుందని వివరించింది.