Delhi: కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అధ్యక్షతన పుణ్య సలీల శ్రీవాస్తవ హెచ్ఎంపీ వైరస్‌పై సమీక్ష జరిగింది. వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. దేశంలో శ్వాసకోస సంబంధిత వ్యాధులతోపాటు చైనాలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసుల స్థితిని సమీక్షించారు. దేశంలో వైరస్ కేసుల సంఖ్య ఎక్కడా అసాధారణ స్థాయిలో లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ పేర్కొన్నారు.
సాధారణంగా శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయని, భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందన్నారు. సబ్బుతో చేతులు తరచూ కడుక్కోవడం, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండడం, మాస్క్ ధరించడం వంటి వ్యాధి నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సూచించారు.