బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నుండి కోర్టు నోటీసులు అందాయి. కరీనా కపూర్ ఖాన్ సైఫ్ అలీఖాన్ దంపతులకు 2021లో రెండవ కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. ఆ కుమారుడికి ’జెహ్’ అనే పేరు పెట్టుకున్నారు. అయితే తన రెండో కుమారుడి జననం తర్వాత కరీనా కపూర్ తన గర్భధారణల సందర్భంగా ఎదుర్కొన్న శారీరక, మానసిన అనుభవాల గురించి ఓ పుస్తకాన్ని రచించింది. దానికి ‘కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పెట్టడం తాజా వివాదానికి కారణమైంది.
ఆ పుస్తకానికి టైటిల్‌లో ’బైబిల్‘ అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో నటికి నోటీసు పంపబడింది. టైటిల్‌లో ఈ పదాన్ని ఉపయోగించడంపై కోర్టు కరీనా నుండి సమాధానం కోరింది.
పుస్తక విక్రయాలపై నిషేధం విధించాలని న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ డిమాండ్ చేయడంతో పుస్తక విక్రయదారులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. పుస్తకం టైటిల్‌లో బైబిల్ అనే పదం క్రైస్తవ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆంథోనీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గర్భాన్ని బైబిల్‌తో పోల్చడం సరికాదని ఆంథోనీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు.